హెర్బేరియానికి అంతర్జాతీయ గుర్తింపు….
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని డా.బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్‌కు అనుబంధంగా ఏర్పాటు చేసిన హెర్బేరియానికి తాజాగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. న్యూయార్క్ బొటానికల్ గార్గెన్ ఆధ్వర్యంలోని ఇండెక్స్ హెర్బేరియం దీనిని గుర్తించింది. ఇది ప్రపంచంలోని హెర్బేరియంలను గుర్తించే సంస్థ. ఈ గుర్తింపు వల్ల భవిష్యత్తులో వాతావరణంలో మార్పులను అద్యయనం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడి అధ్యాపకుడు డా.బి.సదాశివయ్య ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా అడవుల నుంచి మొక్కల నమూనాలు సేకరించారు. వాటిని భద్రపరించేందుకు కళాశాలలో గతేడాది రూ.5 లక్షల వ్యయంతో హెర్బేరియం ఏర్పాటు చేశారు. అందులో ఇప్పుడు 1,206 జాతులకు చెందిన 2,500 మొక్కల నమూనాలను భద్రపరిచారు. ఇందులో 50 వరకు అంతరించి పోతున్న అరుదైన మొక్కలు, 6 కొత్త జాతుల నమూనాలు ఉన్నాయి. ఈ నమూనాలు 100 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.













