పసందైన రుచులతో పతంగుల పండుగ
-పాల్గొననున్న 25 రాష్ర్టాలు, 15కు పైగా దేశాల ఆటగాళ్లు
-ఈ నెల 13, 14, 15 తేదీల్లో స్వీట్, కల్చరల్ ఫెస్టివల్స్ కూడా
-పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్,బుర్రా వెంకటేశం వెల్లడి
ఈ ఏడాది పతంగుల పండుగను పసందైన వంటకాల రుచులను ఆస్వాదిస్తూ వీక్షించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నది.అంతేకాదు ప్రజలు ఆట, పాటలను కూడా చూసి ఆనందించే విధంగా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నది. పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం సెక్రటేరియట్లో విలేకరులకు ఈ వివరాలు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఈనెల 13,14, 15 తేదీలలో హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ పతంగుల పండుగ(టీఐకేఎఫ్)తోపాటు, మిఠాయిల పం డుగ కూడా నిర్వహిస్తామని మంత్రి చందూలాల్ పేర్కొన్నారు. పతంగుల ఉత్సవంలో మన దేశంలోని 25రాష్ర్టాలు,15కు పైగా దేశా ల నుంచి పతంగుల ఆట నిపుణులు పాల్గొంటారని చెప్పారు. సంక్రాంతి పండుగ రాగానే హైదరాబాద్‌తోపాటు, తెలంగాణ అంతటా కొన్ని దశాబ్దాలుగా పతంగుల పండుగను జరుపడం ఆనవాయితీగా వస్తున్నదని ఆయన తెలిపారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఈ ఉత్సవాలను అంతర్జాతీయస్థాయిలో ఘనంగా నిర్వహిస్తున్నదని చెప్పారు.
రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ ఉత్సవాలు జరుపడం వరుసగా ఇది మూడోసారి అని పేర్కొన్నారు. ఇదివరలో ఆగాఖాన్ మైదానంలో ఈ ఉత్సవాలు నిర్వహించేవారమని, అయితే సందర్శకులు లక్ష మందికి పైగా వచ్చే అవకాశం ఉన్నందున వారి సౌకర్యార్థం కార్యక్రమ నిర్వహణా స్థలాన్ని సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌కు మార్చామని చెప్పారు. ఈ మూడు రోజుల్లో పరేడ్ గ్రౌండ్స్‌లో వేయి రకాల మిఠాయిలతో స్వీట్ ఫెస్టివల్ కూడా ఉంటుందని టూరిజం సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. హైదరాబాద్‌లో స్థిరపడిన వివిధ రాష్ర్టాలకు చెందిన కుటుంబాల వారు తమ ఇండ్లల్లో సంప్రదాయంగా చేసుకునే వివిధ రకాల స్వీట్లను ఇక్కడ ప్రదర్శిస్తారని చెప్పారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతీరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు కూడానిర్వహిస్తామన్నారు.













