భద్రాచలంలో కమనీయంగా రామ కల్యాణం
భద్రాచలంలో సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతా సమేత రామచంద్ర మూర్తికి కల్యాణం జరిగింది. వేద పండితులు, మంత్రోచ్చారణలు, పూల దండలు, మామిడి తోరణాలు, తలంబ్రాలు, పట్టు వస్త్రాలు…. ఇలా అత్యంత శోభాయమానంగా వేడుకలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్వాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక మరో మంత్రి పువ్వాడ అజయ్ ముత్యాల తలంబ్రాలను అందజేశారు. కోవిడ్ కారణంగా భక్తులెవ్వర్నీ అనుమతించలేదు. జిల్లా ప్రముఖులు, రాష్ట్ర ప్రముఖులు, అధికారులు, పండితులు మాత్రమే ఈ కల్యాణానికి హాజరయ్యారు. భక్తులందరూ చూసేవిధంగా అన్ని ఛానెళ్లూ రాముల వారి కల్యాణాన్ని ప్రసారం చేశాయి. రాముల వారి తరపున కొందరు పౌరోహితులు, సీతమ్మ వారి తరపున మరికొంత మంది పౌరోహితులు ప్రతినిధులుగా ఉండి, ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. గురువారం మహాపట్టాభిషేక ఘట్టం జరగనుంది.













