ప్రపంచంలోనే అతి చిన్న మైక్రోస్కోప్…

ప్రపంచంలోనే అతి చిన్న మైక్రోస్కోప్ మ్యూస్కోప్‍ను ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కేవలం కొన్ని మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే ఈ మ్యూస్కోప్‍ను సులభంగా లభ్యమయ్యే ఎలక్ట్రానిక్ చిప్స్తో రూపొందించడం విశేషం. ఇది రక్త నమూనాలను పరీక్షించి, వ్యాధికారక క్రిములను ఇట్టే పసిగడుతుంది. కాస్త పెద్ద పరిమాణంలో ఉండే కదిలించేందుకు వీలు లేకుండా టేబుల్ మీద ఉంచే మైక్రోస్కోప్‍లు. మహా అయితే అరచేయి సైజ్‍లో ఉండే మినీ మైక్రోస్కోప్‍లను మనం ఇప్పటి వరకు ఉపయోగిస్తున్నాం. వీటికయ్యే ఖర్చు కూడా ఎక్కువే. పైగా కిందపడితే పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. నిపుణులు మాత్రమే వీటిని ఉపయోగించే వీలుంటుంది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు కొన్ని మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే మ్యూస్కోప్‍ను అభివృద్ధి చేసినట్లు ఐఐటీ హెచ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డాక్టర్ శిశికుమార్ బృందం తెలిపింది.
మిల్లీమైక్రాన్ పరిమాణంలో ఉన్న నమూనాను మ్యూస్కోప్ ద్వారా పరిక్షించే వీలుటుంది. దీనిని కంప్యూటర్‍కు అనుసంధానం చేసి నేరుగా లేదా రిమోట్ ద్వారా పరీక్షలు నిర్వహించవచ్చు. మైక్రో ఎల్‍ఈడీ వెలుగులో నమూనాలను వివిధ కోణాల నుంచి పెద్దవిగా చూసే వీలు కూడా ఉంది. దీనికి ఖర్చు తక్కువ. పైగా ఎక్కడి కైనా తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించే వీలుంటుంది. వ్యాధి నిర్ధారణ, పర్యావరణం, వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లో మ్యూస్కోప్ ఎంత ఉపయోగపడుతుందని దీని రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన పరిశోధకులు ఏక్తా ప్రజాపతి, సౌరవ్ కుమార్ తెలిపారు.