తెలంగాణలో భారీ ఎత్తున ఐఏఎస్ ల బదిలీలు !
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్లు, ఐఏఎస్ అధికారుల బదిలీలు భారీ ఎత్తున జరగనున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో పాలనను మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కసరత్తు చేపట్టారు. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో రెండేళ్ల క్రితం పెద్దఎత్తున ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. పలువురు అధికారులు దీర్ఘకాలింగా ఒకే శాఖలో పని చేస్తున్నారు. వారిలో కొందరు అదనంగా ఇతర శాఖల విధులను నిర్వర్తిస్తున్నారు. కొన్ని శాఖలకు కార్యదర్శులు, కమిషనర్లు సంచాలకులు లేరు. నాలుగు జిల్లాలకు కలెక్టర్లు లేరు. పలు శాఖల్లో పూర్తిస్థాయి అధికారులు లేరు. కొందరు ఐఏఎస్ల పనితీరుపై మంత్రులు ఉన్నతాధికారుల్లో అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలకు చురుకైన కలెక్టర్లు ఉండేలా అన్ని ప్రధాన శాఖలకు అధికారులు ఉండేలా బదిలీలు చేపట్టాలని సీఎం యోచిస్తున్నారు. దీని కసం విసృతస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వపరమైన అవసరాలపైనా సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు పనిచేస్తున్న కాలం, పనితీరు, వివిధ శాఖల్లో ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్కు అందజేశారు. వీటన్నింటి విశ్లేషణ అనంతరం బదిలీలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.













