తెలంగాణలో భారీగా.. ఐఏఎస్, ఐపీఎస్ లు బదిలీలు ?

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‍లు బదిలీలు జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు బదిలీలకు సంబంధించిన జాబితా చేరింది, ఇది వరకే అధికారుల బదిలీలపై కసరత్తు పూర్తిచేశారని అంటున్నారు. గురువారం అమావాస్య కావడంతో ఒకటి రెండు రోజుల్లో బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చే అవకాశముందని అంటున్నారు. ఐపిఎస్‍లు బదిలీల కోసం చాలారోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఒకే పోస్టులో సుదీర్ఘకాలంగా ఉన్న పలువురు అధికారులను బదిలీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పలు జిల్లాల ఎస్పీలు, ఐజీలతో పాటు పోలీసుశాఖకు సంబంధించి భారీ బదిలీలు ఈ దఫా జరిగే అవకాశం ఉందని సమాచారం. ఐఎఎస్‍లకు సంబంధించి కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారుల వివరాలు సీఎం తీసుకున్నట్లు తెలిసింది. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, రెండో టర్మ్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు పూర్తయిన నేపథ్యంలో పాలనను పరుగులు పెట్టించే ప్రణాళికలపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. అందులో భాగంగా ఐఎఎస్, ఐపిఎస్‍ల అధికారుల బదిలీలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.