భాగ్యనగర్ ఖాతాలో మరో ఘనత …
భాగ్యనగరం ఖాతాలో మరో ఘనత చేరింది. ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల్లో రెండో స్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. తొలి స్థానంలో మనదేశానికే చెందిన చెన్నై ఉండటం మరో విశేషం. రెండు దక్షిణాది నగరాలకు జాబితాలో చోటు దక్కడం, రెండూ ప్రపంచంలోనే ప్రథమ, ద్వితీయ స్థానాలు దక్కించుకోవడంపై ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. యూకేకి చెందిన సర్ఫ్‌షార్క్ సంస్థ అంతర్జాతీయంగా 130 నగరాల్లో సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానం అనే నినాదంతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం, పోలీసుశాఖ.. సీసీ కెమెరాల ఏర్పాటులో ఈ సరికొత్త మైలురాయి అందుకున్నాయి. నగరంలో ప్రతీ చదరపు కిలోమీటరకు 480, వెయ్యి మందికి 30 సీసీ కెమెరాలు ఉన్నాయని సర్వే సృష్టం చేసింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావించాక హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. వివిధ బహుళజాతి, అగ్ర దేశాల వ్యాపార, పరిశోధన సంస్థలు భాగ్యనగరంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో సురక్షిత నగరంగా పేరొందితే పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని భావించారు. 2014లో అమల్లోకి వచ్చిన ప్రజాభద్రతా చట్టం కింద సీసీ కెమెరాల ఏర్పాటును ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. లండన్‌ను ఆదర్శంగా తీసుకుని భారీగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సంకల్పించాయి. ఈ క్రమంలో వీటి ఏర్పాటులో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ పోలీస్ నిలిచిన విషయం తెలిసిందే. ఇక నగరాల వారీగా చూస్తే చెన్నై మొదటి స్థానం దక్కించుకుంది. అలాగే హైదరాబాద్‌లో వేల సంఖ్యలో ఉండే సీసీ కెమెరాల దృశ్యాల పర్యవేక్షణకు ప్రత్యేక సాఫ్ట్వేర్ సైతం నిక్షిప్తం చేయడం మరో ప్రత్యేకత.













