ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని రూ.50 లక్షలు.. కేఏపాల్‌పై చీటింగ్ కేస్

ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని రూ.50 లక్షలు కాజేశారని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేఏ పాల్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని జిల్లెలగూడకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి.. కేఏ పాల్ తనను మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించాడు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేసినందుకు తనకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని కేఏ పాల్ మాటిచ్చారని, దాని కోసం రూ.50 లక్షలు డబ్బులు కూడా తీసుకున్నారని, కాని టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని కిరణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే మొత్తం రూ.50 లక్షల్లో రూ.30 లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లించానని, మిగిలిన రూ.20 లక్షలు పలు దఫాలుగా ఇచ్చానని కిరణ్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఇక కిరణ్ ఫిర్యాదుతో కేఏ పాల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా.. ఇంతకుముందు కూడా కేఏపాల్‌పై ఇలాంటి కేసులు నమోదయ్యాయి. 2019లో ఓ మహిళ కూడా తనను అమెరికా పంపిస్తానంటూ డబ్బులు తీసుకుని మోసం చేశారని కేఏ పాల్‌పై కేసు నమోదు చేసింది.