ఎన్నారై పెళ్లిళ్ల పట్ల జాగ్రత్త
పెళ్లి సంబంధాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని మహిళా భద్రత విభాగం చీఫ్ స్వాతీ లక్రా అన్నారు. ఎన్నారై వివాహాలు, వేధింపులు, మోసాలు, నమోదైన కేసుల సత్వర పరిష్కారానికి వివిధ శాఖల మధ్య సమన్వయం.. తదితర అంశాలపై గురువారం జరిగిన వర్క్‌షా్‌పలో ఆమె మాట్లాడారు. ‘‘2019 జూలై 17న హైదరాబాద్‌లో ప్రారంభించిన ఎన్నారై సెల్లో.. ఇప్పటివరకు 73 ఫిర్యాదులు అందగా 70 కేసులు నమోదు చేశాం. 41 కేసుల్లో ట్రయల్స్ పెండింగ్‌లో ఉండగా.. 46 లుక్ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. 32 మంది ఎన్నారై భర్తలపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. విదేశాంగ శాఖ, జాతీయ మహిళా కమిషన్, విదేశీ రాయబారులతో కలిసి పనిచేస్తున్నాం.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎన్నారై పెళ్లిళ్లకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 574 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో (248) ఉన్నాయి’’ అని స్వాతీ లక్రా వివరించారు. అనంతరం ఎన్నారై వివాహాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆడియో సందేశాలు, కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ వైజయంతి, డీఐజీ బి.సుమతి తదితరులు పాల్గొన్నారు.













