నిమ్స్‌లో ట్రయల్స్ పూర్తి…అక్టోబరు నాటికి వ్యాక్సిన్?
కరోనా వ్యాక్సీన్ తయారీలో మరో ముందడుగు పడింది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఉన్న ప్రతిష్టాత్మక నిమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ సోమవారం ప్రారంభమయ్యాయి. దీని కోసం ఎంపిక చేసిన ఇద్దరు వాలంటీర్లకు వైద్యులు కొవాగ్జిన్ డోస్ ఇచ్చారు.భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) సహకారంతో ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌కు చెందిన బయోసేఫ్టీ లెవెల్ 3 ప్రయోగశాలలో టీకాను తయారు చేశారు. కొవాగ్జిన్ మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కు ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతిచ్చిన విషయం తెలిసిందే.నిమ్స్‌లో కొవాగ్జిన్ క్లీనికల్ ట్రయల్స్ వాలంటీర్లుగా ఎంచుకున్న ఒక్కొ వ్యక్తికి 3 ఎంఎల్ చొప్పున వాక్సిన్ అందిస్తారు. 28 రోజుల తర్వాత మరో డోసు ఇస్తారు. తొలి రోజు ఇద్దరికి వాక్సిన్..రేపు మరో నలుగురికి వ్యాక్సిన్‌ను ప్రయోగించే అవకాశం ఉంది. ః నిమ్స్‌లో ఇప్పటి వరకు 60 మంది వాలంటీర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారు. తొలి దశ వ్యాక్సిన్లు అందించిన ఇద్దరు వాలంటీర్లూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, వారిపై వ్యాక్సిన్ ఇంత వరకూ ఎటువంటి దుష్ప్రభావాలూ చూపలేదని నిమ్స్ వైద్యులు చెప్పారు. వీరిని 24గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచుతామన్నారు. అక్టోబరు కల్లా వ్యాక్సిన్? ట్రయల్స్ ప్రక్రియ అంతా సవ్యంగా పూర్తయిపోతే… వ్యాక్సిన్‌ను అతి త్వరలోనే అందుబాటులోకి తేవచ్చునని నిమ్స్ వైద్యులు అంటున్నారు. అన్నీ సజావుగా జరిగితే అక్టోబరు నెల కల్లా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.













