తెలంగాణలో జనతా కర్ఫ్యూ సంపూర్ణంగా
ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ తెలంగాణలో సంపూర్ణంగా జరుగుతోంది. జనం జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా భాగస్వాములౌతున్నారు. తెలంగాణలో ఈ జనతా కర్ఫ్యూ 24 గంటల పాటు పాటించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునకు జనం సానుకూలంగా స్పందించారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా తెలంగాణ మొత్తం దాదాపుగా నిర్మానుష్యంగా మారిపోయింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్ ఇలా అన్నీచోట్లా వీధులన్నీ జన సంచారంలేక బోసిపోయి కనిపించాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజానీకం ఇళ్లకే పరిమితమయ్యారు. 9 డిపోల పరిధిలోని 960 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆటోలు సైతం బంద్‌లో పాల్గొన్నాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. షాపింగ్ మాల్స్, చికెన్, మటన్ దుకాణాలను మూసివేశారు. ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. జనతా కర్ఫ్యూకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు.
హైదరాబాద్ నగరంలో జనతా కర్ఫ్యూకు మంచిస్పందనే వచ్చింది. హైదరాబాద్ వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. మద్యం, మాంసం దుకాణలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు బంద్ అయ్యాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రాంగణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంతో నిత్యం బిజీగా ఉండే నగర రహదారులు ప్రశాంత వాతావరణంతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర సేవల కోసం డిపోకు 5 బస్సులను, అదేవిధంగా మెట్రో రైలు సర్వీసులను ఐదింటిని అధికారులు అందుబాటులో ఉంచారు. జనతా కర్ఫ్యూతో ప్రభుత్వం పారిశుద్ధ్యంపై ప్రత్యేక ద•ష్టి సారించింది. హైదరాబాద్ నగరపాలక, పురపాలక సంస్థల్లో ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్‌ను చేపట్టింది.
కరోనా నివారణలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జనతా కర్ఫ్యూ ఆదివారం మొదలైందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఉదయం 6 గంటల నుండి జనతా కర్ఫ్యూ ప్రారంభమయిందని.. ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల మద్దతు ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఇలాంటి కర్ఫ్యూ చూస్తున్నామని తెలిపారు. ఎమర్జెన్సీ, మెడికల్ వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, కరోనాకు వ్యతిరేకంగా దేశంలో యుద్ధం జరుగుతోందని.. 24గంటల జనతా కర్ఫ్యూ ప్రజల రక్షణ కోసమేనని తెలిపారు.
దేశ రక్షణ కోసం 99శాతం ప్రజలు ఇంట్లోనే ఉన్నారని.. ఇది ప్రపంచానికే గొప్ప స్పూర్తి అని కొనియాడారు. ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలలో ఇలాంటి ప్రయోగాలు విఫలమయ్యాయని.. కానీ దేశంలో అత్యవసర విభాగాలు తప్ప అన్ని బంద్ అయ్యాయని అన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. పాలు, హాస్పిటల్ లాంటి వాటికి తప్ప మిగతా 24 గంటలు బయటకి రావొద్దని కోరారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ లో పాల్గొంటున్నారని అంజనీ కుమార్ పేర్కొన్నారు.
ప్రజలందరూ జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యం కావాలని జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయని.. ఎవరైనా కరోనా అనుమానితులుంటే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. వైరస్ విస్తరించకుండా జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ లోకేష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తకు సంబంధించిన ఫోటోలు న్యూస్బజార్ 9.కమ్ సౌజన్యంతో ఇక్కడ ఇస్తున్నాము.
Click here Photogallery for Janata Curfew in Telangana
Click here Photogallery for Janata Curfew in AP
Click here Photogallery for Janata Curfew in India













