వోట్ వెయ్యడం ఒక బాధ్యత అని యువత కు ఎలా చెప్పాలి?
– తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు
దాదాపు 3-4 నెలల నుంచి కొద్దికొద్దిగా మాట్లాడుకుంటూ ఉన్న, ఒక 40 రోజుల నుంచి మన డైలీ లైఫ్ లోకి చొచ్చుకు పోయిన రాష్ట్ర ఎన్నికలు నిన్నటితో ముగిసాయి. నగరం మరియు రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. రాష్ట్రమంతటా 158. 71 లక్షల ఆడవారు, 1583 లక్షల మగవారు ఓటర్లు గా వున్న తెలంగాణ రాష్ట్రము లో నిన్న (30 నవంబర్) జరిగిన ఎన్నికల్లో రాష్ట్రమంతటా 70.6 % తమ వోట్ హక్కు ని వినియోగించుకోగా, రాజధానిలో (హైదరాబాద్- సికింద్రాబాద్) కేవలం 46% మాత్రమే వోట్ వేశారు. 2018 ఎన్నికల వివరాలు చూస్తే, అప్పుడు కూడా రాష్ట్రమంతటా 73. 8 % వోట్ వెయ్యగా, హైదరాబాద్ మాత్రం 48% దగ్గర ఆగిపోయింది అని తెలిసాక, ఇది పెద్దలు, ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం అని అర్థం అయింది.
ఒక పక్క ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల లో మారిన హైదరాబాద్ ని, కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ ప్రాంతాన్ని చూపిస్తూ తెలంగాణ అభివృద్ధికి చిహ్నం గా చెబుతూ ఉంటే, ఆ నగరం లో వున్న ప్రజలు వోట్ వేయడానికి ఉత్సాహం చూపక పొతే ఎలాగ? అని కొందరు బాధపడటం చూస్తున్నాం. ప్రస్తుతం రోజు రోజు కి పెరుగుతున్న జనాభా తో, నగరం లో కనీస సౌకర్యాలు కల్పించటానికి, నగరంలో రోడ్డు, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎంతో శ్రమ పడుతోంది. ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోంది. గ్రామాలతో పోలిస్తే చదువు కొన్న వారి సంఖ్య నగరంలో ఎక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి నగర ప్రజలు వోట్ చేయడానికి ముందుకు రాక పోతే ఎలా? అన్నది పెద్ద సమస్య అని చెప్పుకోవాలి.
అన్ని బడులకు, కాలేజి లకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నికల రోజు ని సెలవు గా ప్రకటిస్తున్నారు. కొన్ని ప్రైవేటు సంస్థలు పూర్తి సెలవు ఇవ్వగా, మిగతా సంస్థలు వోట్ చేయడానికి అనుమతి ఇచ్చారు. వోట్ వేయడం మన హక్కు – మన బాధ్యత అని పేపర్ లలో, టీవీ లలో, రేడియోలలో ప్రకటనలు ఇచ్చారు. అనేక పెద్దవారు, నాయకులు ఈ విషయాన్ని పడే పడే గుర్తు చేస్తూ వచ్చారు. అయినా నగర పౌరులు, ముఖ్యంగా యువత ఈ బాధ్యత ను పక్కన పెట్టి, వచ్చిన సెలవు దినాన్ని సెలవు దినం లాగే గడపాలని అనుకొన్నారు. ఆ రోజు అన్ని మాల్స్ యువత తో కళకళలాడుతూ వున్నాయి. కూకట్ పల్లి లో ఈమధ్యనే వచ్చిన లులూ మాల్ లో దాదాపు 10000 మంది దాకా ఉన్నారని, ఎవ్వరు వోట్ వేసినట్టు గా అనిపించలేదని ఒకాయన చెపితే ఆశ్చర్యం – బాధ వేసింది.
చదువు కొన్న యువత ని ఎలా ఉత్తేజ పరచాలి?
దేశ ప్రధాన మంత్రి, ఇతర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు , రాజకీయ నాయకులు ముందు రోజు వరకు చెప్పిన మాటలు, కాలనీ లో తెలిసిన పెద్దలు ఇంటింటికి తిరిగి ఇచ్చిన ఓటర్ స్లిప్ లు యువత ని మోటివేట్ చెయ్య లేక పోయాయి అని తెలుస్తోంది. ‘ఈ రాజకీయ నాయకులు, ప్రభుత్వాల వలన మనకి ఒరిగేది ఏమి లేదు’ అన్న నిర్లిప్తత ఏనా ? వాళ్ళ బాధ్యత ను మరచి పోయి సెలవు దినం ని ఎంజాయ్ చేద్దాం అనే నిర్లక్ష్య ధోరణి ఏనా? ఈ రెంటిని దాటి యువత కు ఎన్నికల లో తమ పాత్ర యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద గౌరవాన్ని పెంచేలా చెయ్యాలి.
ఇతర దేశాల్లో పరిస్థితి ఏమిటి?
ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇటలీ, మెక్సికో లాంటి పెద్ద దేశాలతో సహా అనేక దేశాలలో ఓటింగ్ తప్పనిసరి చేశారు. అంటే ఆ దేశాల్లో ఎన్నికలు వచ్చినపుడు ప్రతి పౌరుడు తప్పనిసరి గా వోట్ వెయ్యాలి. అమెరికా దేశం లో కూడా జార్జియా, వర్జీనియా రాష్ట్రాల్లో వోట్ వెయ్యని వారికి ఫైన్ విధించే చట్టం తీసుకు వచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు అని చెబుతూ, ఈ తప్పనిసరి రూల్స్ ఎందుకు? అని వాదించే వారు ఉన్నప్పటికీ, చాలా దేశాల లో తప్పనిసరి ఓటింగ్ పద్ధతి ఉందని మన యువత తెలుసు కోవాలి.
మన ఎన్నికల నిర్వహణలో మార్పులు- ఆధునీకరణ అవసరం
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు తెచ్చుకున్న మన భారతదేశంలో చదువు రాని వారి సంఖ్య ఎక్కువగా ఉన్నా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లు ద్వారా ఓటు వేసే పద్ధతి ని ప్రవేశ పెట్టారు. ఇప్పుడు ప్రతి ఓటింగ్ బూత్ లో ఇద్దరు- ముగ్గురు కార్యనిర్వాహక సభ్యులు- అధికారులు ఉంటారు. అలాగే ప్రధాన పార్టీల ఏజెంట్లు గా ఇంకో ముగ్గురు-నలుగురు ఉంటారు. అందరి దగ్గర ప్రింట్ చేసిన ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఆంటీ ఒక బూత్ లోనే దాదాపు 7-8 ప్రింటెడ్ ఓటర్ లిస్ట్ కాపీలు ఉంటాయి. వాట్ బదులు అందరి దగ్గర ఐప్యాడ్ లు ఉంటే… ఇప్పుడు చేస్తున్న పనే ఇంకా ఎక్కువ ప్రమాణాలతో చెయ్యొచ్చు. అధికారులు, ఏజెంట్ లు కూడా తమ తమ ఐపాడ్ లో వోట్ వేసిన వారిని టిక్ పెట్టు కుంటూ వెళ్ళటమే కాకుండా రాణి వారి లిస్ట్ కూడా మరునాడు తయారు చెయ్యోచ్చు. ఇప్పుడు వున్న ప్రక్రియ లో ఆ వెసులుబాటు లేదు. అన్ని వేల వేల పేజీలు ప్రింట్ లేదా గ్జిరోస్ చేసే ఖర్చు లో ఐపాడ్లు కొనవచ్చు.
అలాగే ప్రతి ఆఫీస్ యాజమాన్యం కూడా ఎన్నికల మరునాడు ఓటు వేయని వారిని గుర్తించి వారికి ఇచ్చిన సెలవు దినం రద్దు చెయ్యటం, లేదా ఇంకో విధమైన శిక్ష వేయటంలో చేస్తే బావుంటుందని, అందుకే ఎన్నికల చట్టం లో చిన్న చిన్న మార్పులు అవసరం అని చాలా మంది అభిప్రాయం పడుతున్నారు.













