ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కి అమెరికన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
ముసీనది పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్, ఎల్బీ నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. సుధీర్ రెడ్డి చేసిన సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను గుర్తించిన ది అమెరికన్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మధుకృష్ణన్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మధుకృష్ణన్ మాట్లాడుతూ సుధీర్ఘ రాజకీయ జీవితంలో సుధీర్ రెడ్డి చేసిన అనేక సేవ, సంక్షేమ కార్యక్రమాలు, పర్యావరణహితం కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు ప్రజలను ఆకర్షించాయన్నారు.
ముడున్నర దశాబ్దాలుగా రాజకీయాలలో నైతిక విలువలతో భవిష్యత్ తరాల కోసం ఆరాటపడుతూ తాను చేసిన ప్రజా సేవ, సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు ప్లాస్టిక్ రహిత, పర్యావరణ హిత కార్యక్రమాలను గుర్తించి ది అమెరికా యూనివర్సిటీ ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసిందని అవార్డు గ్రహీత సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. కరోనా సమయంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, కాలనీ లలో విధిగా మొక్కలు నాటించడం జరిగిందన్నారు. నాగోలో ఫతుల్లగూడలో అంతర్జాతీయ ప్రమాణాలతో శ్మశానవాటిక నిర్మించడం జరిగిందన్నారు. కామినేని ఆస్పత్రి సమీపంలో ఆక్సిజన్ పార్కు నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ తెలంగాణ ప్రతినిధులు శ్రీనివాస్ రంగేశ్వరి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రమాకాంత్ పాల్గొన్నారు.













