హైదరాబాద్ లో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జిని శుక్రవారం ప్రారంభించారు. ఈ ఉక్కు వంతెనను తెంగాణ హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ వంతెన ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ బ్రిడ్జి ప్రారంభంతో పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. రూ. 6 కోట్ల నిధులతో బల్దియా పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మించింది. గత ఫిబ్రవరి 29తేదీన ప్రారంభమైన స్టీల్ బ్రిడ్జి పనులు మే చివరినాటికి పూర్తి అయ్యాయి. చట్సీస్ వైపు అప్రోచ్ రోడ్డు పనులు ఇటీవల పూర్తి చేశారు. ఈ కీలకమైన మార్గంలో బ్రిడ్జి శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది. దీంతో టివి 9 జంక్షన్ నుంచి నాగార్జున సర్కిల్ వరకు వాహనాల రాకపోకల ఇబ్బందులు పూర్తిగా తొలగనుండడంతో ప్రయాణికులకు సమయం కలిసి రానుంది.













