బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. దానిని రద్దు : అమిత్ షా
నిరుద్యోగులకు రూ.3,016 భృతి ఇస్తామన్న వాగ్దానాన్ని కేసీఆర్ నిలబెట్టుకోలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. పటాన్చెరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న ఆయన హామీ ఏమైందని ప్రశ్నించారు. దేశంలో రెండున్నర కోట్ల ఉద్యోగాలు వస్తే, ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదని, కానీ తెలంగాణలో మాత్రం పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల నోట్లో కేసీఆర్ మట్టి కొట్టారని విమర్శించారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్లేనని విమర్శించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 12 మంది బీఆర్ఎస్లో చేరిపోయారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకీ లేదని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే, బీసీ సీఎం చేస్తామని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.













