ఇంత తక్కువ సమయంలో ఎలా స్వస్థలాలకు వెళతారు? హైకోర్టు సీరియస్

లాక్‌డౌన్ విషయంలో తెలంగాణ సర్కారుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక్కసారిగా బుధవారం నుంచి లాక్‌డౌన్ అంటే ఎలా? అని సూటిగా ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల ప్రజలు ఇంత తక్కువ సమయంలో ఎలా వారి వారి ప్రాంతాలకు వెళతారని నిలదీసింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. గతేడాదే లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేసింది. ఈ సారి కూడా ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. లాక్‌డౌన్ కారణంగా ఏమైనా సడలింపులు ఉన్నాయా? అని ప్రశ్నించింది. అలాంటిదేమీ లేదని ఏజీ హైకోర్టుకు తేల్చి చెప్పారు. మందుల రేట్లు, ప్రైవేట్ ఆస్పత్రుల అధిక బిల్లులు ఇలాంటి విషయాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
అంబులెన్స్‌లను ఆపేయడంపై హైకోర్టు సీరియస్
ఏపీ సరిహద్దులో అంబులెన్స్‌లను ఆపేయడంపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఆపొద్దని ఆదేశించింది. ‘‘అంబులెన్స్‌ల నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా?’’ అంటూ సూటిగా ప్రశ్నించింది. అలాంటి ఆదేశాలేమీ లేవని ఏజీ హైకోర్టుకు తెలిపారు. అయితే మౌఖిక ఆదేశాలున్నాయా? అని మరో ప్రశ్న వేసింది. ఈ విషయాన్ని మాత్రం తాము సీఎస్‌ను అడిగి చెబుతామని ఏజీ వివరించారు. ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతుంటే సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఆపడమేంటని అసహనం వ్యక్తం చేసింది. గతంలో తాము సూచించిన మొబైల్ టెస్టులను కూడా చేయలేదని, ఇప్పుడు మాత్రం అంబులెన్స్‌లను ఆపుతున్నారని సుతిమెత్తగా చురకలంటించింది. అంబులెన్స్‌లను ఆపడం రాజ్యాంగ విరుద్ధమన్న విషయం మీకు తెలుసా? అని సూటిగా ప్రశ్నించింది. హైదరాబాద్ అనేది ఓ మెడికల్ హబ్ అని, ఆరోగ్యం కోసం ఎంతో మంది వస్తుంటారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజలను ఇక్కడికి రావొద్దని చెప్పడానికి ప్రభుత్వానికి ఏం అధికారముందని ప్రశ్నించింది. హైదరాబాద్‌లోని కొన్ని ఆస్పత్రుల్లో అంతర్జాతీయ రోగులు కూడా ఉంటారని, అలాగని వారిని కూడా ఆపేస్తారా? అని మండిపడింది. సరిహద్దుల్లో నిలిచిపోయిన అంబులెన్స్‌లను ఆపొద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.