మాజీ ఎంపీ వివేక్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ
మాజీ, ఎంపీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి.వివేక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివేక్ ఎన్నిక చెల్లదంటూ అంబుడ్స్ మెన్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం కొట్టివేసింది. తాజా పునర్విచారణ జరపాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం ఆదేశించింది. కోర్టు తాజా ఉత్తర్వులతో వివేక్ మరోసారి పదవి కోల్పోనున్నారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా అజారుద్దీన్‌పై వివేక్ గెలుపొందారు. అయితే వివేక్ ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ హెచ్‌సీఏ పదవిలో కొనసాగడం లోధా కమిటీ సిఫార్సులకు, చట్టానికి విరుద్దమంటూ అజారుద్దీన్ అంబుడ్స్ మెన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అంబుడ్స్ మెన్ వివేక్ ఎన్నికల చెల్లదని తేల్చిచెప్పింది. అంబుడ్స్ మెన్ నిర్ణయంతో పదవి కోల్పోయిన వివేక్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి అంబుడ్స్ మెన్ తీర్పును నిలివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో వివేక్‌కు ఊరట కలిగింది.
అయితే సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ అజారుద్దీన్ ధర్మాసనం ఎదుట అప్పీలు దాఖలు చేశారు. అజారుద్దీన్ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేసింది. దీనిపై తాజాగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జిని ఆదేశించారు. ధర్మాసనం తాజా ఉత్వర్వులతో అంబుడ్స్ మెన్ నిర్ణయం అమలులోకి వచ్చినందుకు వివేక్ మరోసారి పదవి కోల్పోనున్నారు.













