రూ.10 వేల కోట్లతో ఆరోగ్య శాఖను అభివృద్ధి చేస్తాం
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్య శాఖను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో వంద పడకల ఐసీయూ వార్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ రూ.33 కోట్లతో నిలోఫర్‌లో మరో 800 పడకలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యానికి దీటుగా సేవలను అందించాలని వైద్యులను కోరారు. హైదరాబాద్ నలువైపులా నాలుగు మెడికల్ టవర్లను తీసుకురావాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు. వైద్యారోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి కార్యక్రమం నిలోఫర్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు.
రాష్ట్రంలో కరోనా రెండో దశ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతమయ్యాయి. వ్యాక్సినేషన్లో దేశ సగటు కంటే తెలంగాణ ముందుందన్నారు. కరోనా మూడో దశ సన్నద్ధతకు రూ.133 కోట్ల కేటాయించాం. చిన్న పిల్లల కోసం 5వేల పడకలను సిద్ధం చేశామన్నారు. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30 శాతం నుంచి 50 శాతం పెరిగాయి. తల్లి, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. మరో 8 వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి అని అన్నారు. వైద్యంపై ప్రభుత్వం, డాక్టర్లు, ప్రజలకు మరింత విశ్వాసం కల్పించాలి అని హరీష్‌రావు సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డీఎంఈ రమేష్ రెడ్డి, నిలోఫర్ సూపరింటెండెంట్ మురళి కృష్ణ, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, హైసియా ఎండీ భరణి, నిర్మాన్, ఇన్పోసిస్, ఓపెన్ టెక్స్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.













