కేటీఆర్ కు అరుదైన గౌరవం.. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం
అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్న ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ 21వ ఇండియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యూయేట్ విద్యార్థులు కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఈ కార్యక్రమం జరగనున్నది. గడచిన పదేండ్లలో తెలంగాణ సాధించిన వృద్ధిలో కేటీఆర్ ప్రభావవంతమైన నాయకత్వం, రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చిన తీరు తమకు ఎంతో స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. తెలంగాణ, భారత దేశ భవిష్యత్తు అవకాశాలపై మీ ఆలోచనలు మాకు ఎంతగానో ఉపయోగపడతాయి. జ్ఞానాన్ని అందిస్తాయని దృఢంగా విశ్వసిస్తున్నాం అని ఆహ్వానంలో తెలిపారు. హార్వర్డ్‌లోని ఇండియా కాన్ఫరెన్స్ అమెరికాలో విద్యార్థులతో నిర్వహించబడే అతిపెద్ద సదస్సు. విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యాపార ప్రముఖులు, విధాన నిర్ణేతలు సహా వెయ్యిమంది వరకు ప్రవాస భారతీయులు ఇందులో పాల్గొంటారు.













