కర్ణాటకలో అమలు చేయలేదు కానీ… తెలంగాణలో
12 సార్లు ఎన్నికల్లో గెలిపించినా జహీరాబాద్‌కు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. జహీరాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఎందుకు నెరవేర్చలేదు అని ప్రశ్నించారు. కర్ణాటకలో అమలు చేయలేని హామీలను తెలంగాణలో నెరవేరుస్తారా? అని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ప్రస్తుతం అక్కడ రైతలుకు 2 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబంధు కింద ఎకరాకు రూ.16 వేలు ఇస్తామన్నారు. జనవరి నుంచి అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడమే కాకుండా ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచబోతున్నామని మంత్రి హామీ ఇచ్చారు.













