నిబంధనలు పాటిస్తే ఏ మైక్రాన్.. మన వద్దకు రాదు : మంత్రి హరీశ్ రావు
కరోనా నిబంధనలు పాటిస్తే ఏ మైక్రాన్ కూడా మన వద్దకు రాదు అని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఓల్డ్ బోయిన్‌పల్లిలో బస్తీ దవాఖానాను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ కొంచెం జాగ్రత్త ఉంటే కరోనాను అరికట్టొచ్చు అన్నారు. టీకాలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల 51 లక్షల మంది మొదటి డోసు తీసుకున్నారు. రెండో డోసు కోటి 30 లక్షల మంది మాత్రమే తీసుకున్నారు. చాలా మంది రెండో డోసు తీసుకోలేదు. ఈ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. టీకాలు సురక్షితమైనవి. అనుమానాలు, అపోహాలు అవసరం లేదు. రెండు డోసులు తీసుకుంటే మన ప్రాణాలను కాపాడుకోవచ్చు. 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసుకోవాలన్నారు. టీకాలు వేసేందుకు ఆరోగ్య కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారు.
ఒమిక్రాన్ తెలంగాణకు రాలేదు అని స్పష్టం చేశారు. కర్ణాటకలో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ధారించింది. మన హైదరాబాద్, తెలంగాణలో దేవుని దయవల్ల రాలేదన్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె శాంపిళ్లను జీవోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాం. నాలుగైదు రోజుల్లో ఆమెకే ఏ వేరియంట్ సోకింది అనేది తెలుస్తుందన్నారు. మాస్కు ధరించండి, టీకాలు వేసుకోండి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. స్వీయ నియంత్రణ పాటించాలి. వీటన్నింటిని పాటిస్తే కరోనాను తరిమికొట్టొచు. ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు.













