హైదరాబాద్‌పై మళ్లీ కుట్రలు జరుగుతున్నాయి: హరీశ్ రావు సంచలన ఆరోపణలు

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు మరికొద్ది రోజుల్లో ముగుస్తున్న ఈ టైంలో మళ్లీ భాగ్యనగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. జూన్ 2వ తేదీతో ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తుందని, అప్పటి నుంచి హైదరాబాద్ పూర్తిగా తెలంగాణ రాజధానిగా మారుతుందని, కానీ ఇప్పుడు కొంతమంది దీనిని మార్చి హైదరాబాద్‌ను తెలంగాణకు కాకుండా చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాతం(యూటీ)గా చేసే కుట్రలు జరుగుతున్నాయి. జూన్ 2తో పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తోంది. ఈ క్రమంలో కొందరు హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధాని చేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్ మనకు దక్కాలంటే యావత్ తెలంగాణ ఒక్కటవ్వాలి’’ అంటూ హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.