హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలను జేబు సంస్థలుగా వాడుతోందని ఆయన ఆరోపించారు. విచారణ సంస్థలతో తమను ఇబ్బంది పెట్టాలని కేంద్రం చూస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఎవరు చేశారో అందరికీ తెలిసిందేనని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తమను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. కేసును సీబీఐకి అప్పగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. సీబీఐకి అప్పగిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.













