మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడిపై కాల్పులు
నగరంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడిపై తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఫిలింనగర్ ప్రాంతంలో రోడ్ నంబర్ 86లో ముఖేష్‌గౌడ్ నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన విక్రమ్‌గౌడ్‌ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపింది ఎవరనేది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు. విక్రమ్‌గౌడ్ పూజ కోసం తెల్లవారుజామున 3 గంటలకు ఇంటి బయటకు వచ్చిన సమయంలో దుండగులు కాల్పులు జరిపి పరారైనట్లు పోలీసుల వెల్లడించారు. కుటుంబ కలహాల కోణంలో ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే విక్రమ్ గౌడ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు.













