హైదరాబాద్ లో గ్రీన్ పో సమ్మిట్
రాష్ట్ర రాజధాని మరో జాతీయ సదస్సుకు వేదికైంది. ఈ నెల 17 నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్లోని హెచ్ఐఐసీ వేదికగా గ్రీన్పో సమ్మిట్ జరుగబోతున్నది. ఈ సమావేశాన్ని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఐజీబీసీ ఫౌండర్, చైర్మన్ పరశురామన్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్రీన్ బిల్డింగ్కు డిమాండ్ నెలకొన్నదని, వచ్చే ఐదేండ్లకాలంలో రెండింతల స్థాయిలో వృద్ధిని నమోదు చేసుకుంటున్నదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం రూ.9 లక్షల కోట్ల స్థాయిలో ఉన్న ఈ గ్రీన్ బిల్డింగ్ ఉత్పత్తుల మార్కెట్ విలువ 2020 నాటికి రూ.18 లక్షల కోట్లకు చేరుకోనున్నదని ఆయన అంచనా వేస్తున్నారు. అలాగే 5.2 బిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రస్తుతం గ్రీన్ బిల్డింగులు నిర్మించగా, అదే వచ్చే నాలుగేండ్ల కాలంలో 10 బిలియన్ చదరపు అడుగులకు చేరుకోనున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సీ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ బిల్డింగ్లను నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు చేయూతను అందిస్తున్నదన్నారు.













