13 తర్వాత జీహెచ్ఎంసీ నోటిఫికేషన్
హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 13వ తేదీ తర్వాత ఎప్పుడైనా రావచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి తెలిపారు. 13న జీహెచ్ఎంసీ పరిధిలో తుది ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు. అనంతరం ఎప్పుడైనా ఎన్నికల ప్రకటన జారీ చేయవచ్చన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చే వారికి తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి బాధ్యత రిటర్నింగ్ అధికారులదే అని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఓటర్ల జాబితా ముసాయిదా ఈ నెల ఏడో తేదీన ప్రచురిస్తారని, అభ్యంతరాలను ఈ నెల 11వ తేదీ వరకూ తీసుకుంటారని, 13న తుది జాబితా ప్రచురణ ఉంటుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు, 150 డివిజన్లు ఉన్నాయని పేర్కొంటూ 30 సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లకు ఎన్నికల బాధ్యతలు అప్పగించామన్నారు. 150 వార్డులకు 150 మంది రిటర్నింగ్ అధికారులు, 150 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఉంటాయని తెలిపారు.













