మేడారం మహాజాతర తొలిఘట్టం ప్రారంభం
తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో కొలువైన వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మహాజాతర పూజల తొలిఘట్టం ప్రారంభమైంది. మేడారంలోని సమ్మక్క దేవత, కన్నెపల్లిలోని సారలమ్మ దేవత పూజా మందిరాల్లో మండమెలిగే పండగను పూజారులు ఘనంగా నిర్వహించారు. పూజారులు కుటుంబాల సమేతంగా మందిరాలకు వెళ్లి శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. జాతరను దిగ్విజయంగా నిర్వహించే శక్తి సామర్థ్యాలను అందించాలని వేడుకున్నారు. దేవతలను గద్దెల వద్దకు తీసుకువచ్చే కొక్కెర కృష్ణయ్య, కాక సారయ్యతోపాటు ప్రధాన పూజారులు ఉపవాస దీక్షలు బూనారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అధికారులు మేడారంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.













