గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ.6.45 కోట్లు

గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని మంజూరు చేసింది. దీనికోసం రాష్ట్రంలోని 15 జిల్లాలకు రూ.6.45 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో అర్హులైన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 160 మంది గల్ఫ్ కార్మికులు మరణించినట్లు అంచనాలు ఉన్నాయని తెలంగాణ పీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ వినోద్, కాంగ్రెస్ ఎన్నారై సెల్ కన్వీనర్ భీంరెడ్డిలు తెలిపారు. అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.10.60 కోట్లు కేటాయించిందని, ఇందులో రూ.6.45 కోట్లు విడుదల చేయడంపై సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మృతుల సంఖ్య ఆధారంగా నిజామాబాద్ జిల్లాకు అత్యధికంగా రూ.1.75 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు.