తెలంగాణలో ప్రభుత్వ/ఐటి కార్యాలయాలు షురూ…
లాక్డవున్ దశలవారీ సడలింపుల్లో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. లాక్ డవున్ని ఈ నెలాఖరు దాకా కొనసాగించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అదే సమయంలో వైన్ షాప్స్కి పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే. అలాగే భవన నిర్మాణ అనుబంధ రంగాలు కూడా పనిచేయవచ్చునని అనుమతించింది. ఆ తర్వాత రెండో సడలింపుగా ప్రభుత్వ కార్యకలాపాలపై దృష్టి పెట్టింది. ఇక సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేసే దిశగా కసరత్తు ప్రారంభించింది.
దీనిలో భాగంగా గ్రీన్, ఆరంజ్ జోన్లలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ పని ప్రారంభిస్తాయి. అయితే రెడ్ జోన్లో మాత్రం తొలుత 33శాతం సిబ్బందితో మాత్రమే ప్రారంభమవుతాయి. మరోవైపు హైదరాబాద్లో ఐటి కంపెనీలు సైతం తెరుచుకోనున్నాయి. తొలి దశలో ఆయా ఐటి కార్యలయాల్లో 33శాతం ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తారు. అది కూడా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని రూఢి చేసుకున్నాక మాత్రమే సంస్థ కార్యకలాపాలకు ఓకె చెప్తారు.













