తెలంగాణలో లాక్డౌన్ పై సీఎస్ స్పష్టత
తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి లాక్డౌన్ విధించడం లేదని ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. లాక్డౌన్ విధిస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. తెలంగాణలో ఈ నెల 30 వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు అన్ని రకాల షాపులు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి ఒక ఫేక్ జీవో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన సీఎస్ సోమేశ్‌కుమార్ అది ఫేక్ జీవో అని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌పై ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలను కోరారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ఆలోచన ఏమీ లేదని మరోసారి స్పష్టం చేశారు.













