మెట్రో ఫార్మా సిటీని రద్దు చేయట్లేదు : సీఎం రేవంత్
మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయట్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు రేవంత్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామని స్పష్టం చేశారు. బీహెచ్ఈఎల్ నుంచి విమానాశ్రయానికి 32 కి.మీ దూరం ఉంటుందన్నారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, చాంద్రాయణ గుట్ట విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్‌కి లింక్ చేయనున్నట్లు తెలిపారు.
అవసరమైతే వియాపూర్ నుంచి రామచంద్రాపురం, మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తాం. మేము కొత్తగా ప్రతిపాదించబోతున్న మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయి అని వివరించారు. ఫార్మాసిటీ, రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య జీరో కాలుష్యం తో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక క్లస్టర్ల వద్ద పరిశ్రమల్లో పనిచేసే వారికి ఇళ్ల నిర్మాణం చేపడతాం. కార్మికులు హైదరాబాద్ వరకు రాకుండా అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తాం. యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తాం. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా శిక్షణ ఉంటుంది. ఈ నైపుణ్యాలకు సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయి అని అన్నారు.













