నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారు : తమిళిసై
మన రాజ్యాంగం ఎంతో మహోన్నతమైందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆమె ఎగురవేశారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందు చూపుతో వ్యవహరించి దానిని తయారు చేశారని చెప్పారు. అన్ని వర్గాల ఆశలు, ఆశయాల సాధనకు రాజ్యాంగం తోడ్పడిరదని వివరించారు. మన దేశం భిన్న జాతులు, మతాలు, కులాల సమాహారమని అన్నారు. అందరినీ ఐక్యం చేసి ఒకే జాతిగా నిలబెట్టిన ఘనత రాజ్యాంగానిదేనని చెప్పారు. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాజ్యాంగం మార్గదర్శకత్వంలో ముందుకెళ్లడం గర్వించదగ్గ విషయం. ఆ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు ముందుకెళ్తే ప్రజలు ఊరుకోరు. గడిచిన పదేళ్లలో అలాగే వ్యవహరించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే రాష్ట్రం సాధించుకున్నాం. నియంతృత్వ ధోరణితో వెళ్లడానికి తెలంగాణ సమాజం సహించదు. ఎన్నికల్లో తీర్పు ద్వారా నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని విస్పష్టమైన తీర్పు ఇచ్చారు అని అన్నారు.













