వారినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది
నిబద్ధత కలిగిన వైద్యులు, వైద్య పరిశోధకులు ఉన్నందువల్లే దేశం క్లిష్ట పరిస్థితుల్లోనూ కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటోందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. వైద్యులు అంకితభావంతో పనిచేసినందువల్లే దేశంలో వైరస్ వ్యాప్తిని తగ్గించగలిగామని ఆమె అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి కలిసికట్టుగా పనిచేస్తున్నాయని తెలిపారు. సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్ అక్కడ పనిచేస్తున్న వైద్యులను అభినందించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో సాధారణ రోగుల కోసం ఈఎస్ఐ వైద్యులు శ్రమిస్తున్న తీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో సాధారణ జబ్బుతో బాధపడుతున్న వారినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తమిళి సై గుర్తు చేశారు. కరోనా వైరస్‌పై ఈఎస్ఐ, డీఆర్డీవో కలిసి పరిశోధనలు చేయడం మంచి ఫలితాలనిస్తోందని తెలిపారు.













