విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా : గవర్నర్
ఆంధ్రలో విలీనమైన 5 గ్రామ పంచాయతీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల చాలా బాధపడుతున్నానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భద్రచాలం పర్యటనలో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారిని గవర్నర్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆదివాసీలతో గవర్నర్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సదర్భంగా గవర్నర్కు భద్రాచాలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పలు సమస్యలను విన్నవించారు. ఆంధ్రాలో విలీనమైన గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపి ఇక్కడి ప్రజల బాధలను అర్థం చేసుకోవాలని కోరారు. గోదావరి వరదలతో ఇక్కడి ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని, విలీన గ్రామాల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని గవర్నర్ హామీ ఇచ్చారు.













