18న బడ్జెట్… 10 రోజుల పాటు సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26 వరకు జరగనున్నాయి. 18న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు బీఏసీలో నిర్ణయించారు. నేడు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. రేపు దివంగత శాసనసభ్యుడు నోముల నర్సింహయ్యకు ఉభయసభలు సంతాపం తెలపనున్నాయి. 17వ తేదీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ, దానిపై సమాధానం ఉంటుంది. 19, 21 తేదీలను సెలవుగా ప్రకటించారు. 20,22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. 23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది. 26న ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ చట్టాలపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఏసీ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ కోరింది.













