కేసీఆర్ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చిన గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీల కోటాలో ప్రభుత్వం పంపిన సిఫార్సులను గవర్నర్ తిరస్కరించారు. దీంతో, తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. గవర్నర్ తమిళిసై కేసీఆర్ ప్రభుత్వానికి మళ్లీ షాకిచ్చారు. రాష్ట్రంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన సిఫార్సులను తమిళి సై తిరస్కరించారు. ఆర్టికల్ 171 (5) ప్రకారం అర్హతలు సరిపోవని తమిళిసై అన్నారు.
తగిన అర్హతలు లేకుండా నామినేట్ చేయడం తగదు. అర్హతలు ఉన్న ఎంతో మంది ప్రముఖులు రాష్ట్రంలో ఉన్నారు. అర్హులను పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లు సిఫార్సు చేయడం సరైనది కాదు. ఇలా చేస్తే ఆయా రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం ఉన్న వారికి గుర్తింపు లభించబోదు. సరైన వ్యక్తులకు అవకాశాలు నిరాకరించినట్లవుతుంది. ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్ చేయకూడదో ప్రతిపాతినిధ్య చట్టంలో స్పష్టం ఉంది. మంత్రివర్గ సిఫార్సులో అన్ని అంశాలను జత చేయలేదు అని వెల్లడించారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లను తిరస్కరించాలని ఈ సందర్భంగా మంత్రి మండలి, ముఖ్యమంత్రికి సూచించినట్లు గవర్నర్ పేర్కొన్నారు.













