ఆ బెదిరింపులను ఉపేక్షించవద్దు : గవర్నర్
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. జేఎన్టీయా ఆడిటోరియంలో నిర్వహించిన 14వ జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 46 శాతం ఓటింగ్ నమోదైందని, అలాంటివి పునరావృతం కాకుండా రాజ్యాంగ కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో తనకు ఓటు వేయకుంటే చనిపోతానని బెదిరించిన వారూ ఉన్నారని, అలాంటి విషయాలను ఉపేక్షించవద్దని ఎన్నికల సంఘానికి గవర్నర్ సూచించారు. ఓటు వేసేటప్పుడు అభ్యర్థులను పూర్తిస్థాయిలో విశ్లేషించి మంచి వారిని ఎన్నుకోవాలన్నారు. పోలింగ్ రోజు ఇచ్చే సెలవును టూర్ల కోసం ఉపయోగించడం బాధాకరమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కును వినియోగించుకోవడమే పౌరుల ప్రథమ బాధ్యతని చెప్పారు.













