హైదరాబాద్ లో గూగుల్ అతిపెద్ద క్యాంపస్ నిర్మాణం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అతి పెద్ద సంస్థగా ఉన్న గూగుల్ హైదరాబాద్‌లో 22 అంతస్తులతో నిర్మిస్తున్న క్యాంపస్ భవన నిర్మాణం చివరిదశలో ఉంది. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల అతి పెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లోనే నిర్మిస్తోంది. ఇప్పటికే బెంగుళూరు, గుర్గావ్, ముంబాయి నగరాల్లో ఆ సంస్థ కార్యాలయాలను నిర్వసిస్తున్నా అవన్నీ లీజుకు తీసుకున్న భవనాల్లోనే ఉన్నాయి. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో స్వంత భవనాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద క్యాంపస్‌గా హైదరాబాద్‌ను పరిగణిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటి శాఖ మంత్రిగా ఉన్న కెటిఆర్ అమెరికా పర్యటనలో ఆ దేశంలోని గూగుల్ హెడ్‌క్వార్టర్‌కు వెళ్ళి గ్లోబల్ హెడ్‌తో చర్చలు జరిపి హైదరాబాద్‌లో క్యాంపస్‌ను నెలకొల్పడానికి అవసరమైన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా 7.2 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలో కేటాయించింది. సాఫ్ట్వేర్ దిగ్గజంగా ఉన్న గూగుల్ త్వరలో ఈ నూతన భవనం నుంచే కార్యకలాపాలను నిర్వహించనున్నది.
సమైక్య రాష్ట్రంలోనే గూగుల్ తన స్వంత క్యాంపస్‌ను నెలకొల్పుకోడానికి 2007లో ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో చర్చలు జరిపిన అనంతరం 20 ఎకరాల స్థలాన్ని సమకూర్చినా లీగల్ సమస్యల కారణంగా అది సాకారం కాలేదు. ఆ తర్వాత 2013లో రాయదుర్గంలో మరోమారు ప్రభుత్వం స్థలాన్ని సమకూర్చినా అది కూడా విఫల ప్రయోగంగానే మిగిలిపోయింది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెటిఆర్ చొరవతో ఇప్పుడు సాధ్యమైంది. ఈ స్థలాన్ని గూగుల్ సంస్థ తీసుకున్న తర్వాత రాష్ట్ర పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి 2018లో అనుమతులు కూడా మంజూరయ్యాయి. ఇప్పటికే 40 దేశాల్లో 70 కార్యాలయాలున్న గూగుల్ ఆసియాలోనే అతి గొప్ప క్యాంపస్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనుకుంటోంది.
భవన నిర్మాణానికి వెయ్యి కోట్లు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతోపాటు భవనానికి పూర్తిస్థాయిలో సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసి ప్రపంచంలో గొప్ప భవనంగా తీర్చిదిద్దేలా గూగుల్ డిజైన్‌ను ఖరారు చేసింది. 300 కిలో వాట్ల సోలర్ విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రత్యేక ప్లాంట్‌ను ఈ డిజైన్‌లో భాగంగా ఏర్పాటు చేస్తోంది. పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా భవనప్లాన్ను రూపొందించింది. గూగుల్ సంస్థలో ఇప్పటికే సుమారు ఏడు వేల మంది పనిచేస్తుండగా కొత్త క్యాంపస్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే మరో ఆరున్నర వేల మందికి ఉపాధి లభించనుంది. పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభించనుంది. 22 అంతస్తులతో రూపుదిద్దుకుంటున్న ఈ భవనంలో రెండు బేస్మెంట్లను పూర్తిగా వాహనాల పార్కింగ్ కోసమే వినియోగించేలా డిజైన్ చేసింది. ఈ భవనం మొత్తం 20 లక్షల చ.అ. విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటోంది.
గత సంవత్సరం అక్టోబర్‌లో గూగుల్‌కు నిర్మాణపరమైన అనుమతులు లభించాయి. రెండున్నర సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసి కార్యకలాపాలను ప్రారంభించేందుకు గూగుల్ సంస్థ వేగంగా పనులు ప్రారంభించింది. పనులు పూర్తి కాగానే ప్రస్తుతం హైదరాబాద్‌లో లీజు భవనంలో ఉన్న గూగుల్ సంస్థను కూడా నూతన క్యాంపస్‌లోకి తరలించనున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని ఐదు ప్రఖ్యాత సాప్ట్వేర్ కంపెనీలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్లు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.













