గ్లోబల్ సమ్మిట్‌కు భారీగా ఏర్పాట్లు
నవంబర్ చివర్లో ప్రపంచ స్థాయి సమ్మిట్‌కు వేదిక కానున్న భాగ్యనగరానికి విచ్చేస్తున్న అతిథులను అలరించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ ప్రధాని సహా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ఇతర ప్రముఖులు హాజరుకానున్న తరుణంలో కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లకు జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ శ్రీకారం చుట్టింది. బల్దియా కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడి వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన ఇప్పటికే సమ్మిట్‌కు సంబంధించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో పర్యటించటంతోపాటు విస్తృత సమీక్షలతో పక్కా ప్రణాళికతో పనులకు శ్రీకారం చుట్టారు. రూ.10 కోట్లతో చేపట్టదలచిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పనులకు నవంబర్ రెండో వారం కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి సమ్మిట్‌కు నాక్ వేదిక కాబోతుండటంతో దానికి అనుసంధానంగా ఉన్న దారులు, పుట్‌పాత్‌లు అబ్బురపరిచే త్రీడీ క్రాసింగ్‌లు, కలర్‌పుల్ పాట్స్‌తో అలంకరిస్తున్నారు.













