కాలిఫోర్నియా వర్సిటీతో జీహెచ్ఎంసీ ఒప్పందం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), రాష్ట్ర ప్రభుత్వం, లాస్ ఏంజెల్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (యుఎస్సీ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. బుద్ధపూర్ణిమ కార్యాలయంలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ తరపున మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బీ జనార్దన్‌రెడ్డి, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన, యూఎస్సీ తరపున యూఎస్సీ మార్షిల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీస్ జేమ్స్ జీ ఎల్లీస్, వైస్ డీన్ టైరోన్ చల్హాన్ సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా పౌరసేవల్లో సామాజికాంశాలు, పన్నుల వసూళ్లలో లోపాలు, పన్నుల ఆదాయం పెంపు వంటి అంశాల్లో సమన్వయం చేసుకోన్నుట్టు అధికారులు తెలిపారు.
ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలను జీహెచ్ఎంసీలో అమలుచేయడంతోపాటు ఐటీ, అత్యుత్తమ పర్యావరణ, సాంకేతిక విధానాలు, మెరుగైన నిర్వహణ పద్ధతుల్లో జీహెచ్ఎంసీ, యూఎస్సీలు కలిసి పనిచేస్తాయని వివరించారు. ఈ ఒప్పందం ఐదేండ్ల పాటు అమల్లో ఉంటుందన్నారు. ప్రఖ్యాత యూనివర్సిటీతో ఒక స్థానిక సంస్థ ఈ తరహా ఒప్పందం చేసుకోవడం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు.













