తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ గ్రేటర్ పరిధిలో కేసులు గుర్తింపు కోసం అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పరిధిలో కరోనా లక్షణాలు కలిగినవారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్‍ఎంసీ పరిధిలో కరోనా వ్యాప్తి తాజా పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జోనల్ కమిషనర్లు, మరియు జీహెచ్‍ఎంసీ డిప్యూటీ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి, పట్టణ ఆరోగ్య కేంద్రం మరియు బస్తీ దవాఖానాల్లో ఔట్ పేషెంట్ క్లినిక్ ను ప్రారంభించాలని చీఫ్ సెక్రటరీ డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులందరికీ వారికి హో ట్రీట్ మెంట్ కిట్లను అందజేయాలని ఆయన ఆదేశించారు.
ఈ సందర్భంగా ఇంటి సర్వే కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి బృందంలో ఇద్దరు మున్సిపల్ స్టాఫ్, ఇద్దరు ఆశా వర్కర్లు, ఒక ఏఎన్‍ఎం ఉండేలా చూడాలని జీహెచ్‍ఎంసీ అధికారులకు స్పష్టం చేశారు. జ్వరం మరియు ఇతర లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించడానికి బృందాలు ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటినీ సందర్శించాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ బృందాలు మెడిసిన్ కిట్లను అప్పగిస్తాయని, కరోనా రోగ లక్షణాలున్న వ్యక్తులకు వాటిని ఎలా తీసుకోవాలో సలహా ఇస్తామని పేర్కొన్నారు.