బీజేపీలో చేరిన జీహెచ్ఎంసీ మాజీ మేయర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మాజీ మేయర్, కాంగ్రెస్ నాయకురాలు బండ కార్తిక రెడ్డి బీజేపీలో చేరారు. కార్తిక రెడ్డి, ఆమె భర్త చంద్రారెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టడమే బీజేపీ లక్ష్యమన్నారు. రెండు పడకల గదుల ఇళ్ల ఎక్కడని పేదలు అడుగుతున్నారని దుయ్యబట్టారు. గ్రేటర్ మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కార్తిక రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు సీటు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి బీజేపీ పనిచేస్తోందని, తనకు న్యాయం జరుగుతుందనే బీజేపీలో చేరినట్లు చెప్పారు. అయితే ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆమె సృష్టం చేశారు. నగరంలోని 150 డివిజన్లలో బీజేపీ తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేని.. ఈ పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారును షెడ్డుకు పంపిస్తే, సారు.. కారు.. సర్కారు.. ఇక రారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఏం జరగబోతుందో దేశం మొత్తం చూస్తోందన్నారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా దుబ్బాకలో బీజేపీని ప్రజలు గెలిపించారన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను మజ్లిస్ పార్టీకి అప్పగించారని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలో మేనిఫెస్టో తయారీ, రూపకల్పన, సమస్యలు, సలహాలు, సూచనల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాల్‌సెంటర్‌కు వచ్చే సూచనలను మేనిఫెస్టోలో పొందుపరుస్తామని బండి వివరించారు.













