జీహెచ్ఎంసీ ఎన్నికలకు మోగిన నగారా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి షెడ్యూల్ విడుదల చేశారు. గ్రేటర్ పరిధిలోని 150 వార్డులకు ఎన్నికలు జరుగనుండగా.. ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. 24న ఉప సంహరణ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు గుర్తులు కేటాయించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 1న పోలింగ్ జరుగనుండగా అసరమైతే డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. 4వ తేదీన ఓట్లు లెక్కింపు నిర్వహించి, ఫలితాలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. షెడ్యూల్ విడుదలతో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని చెప్పారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతాయని పార్థసారధి తెలిపారు. జీహెచ్ఎంసీ చట్ట ప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని, 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లే ఇప్పుడూ కొనసాగిస్తామని తెలిపారు. రిజర్వేషన్ల కేటాయింపులు అనేది ప్రభుత్వ వ్యవహారమని, అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే ఈ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించినట్లు ఎన్నికల కమిషనర్ పార్థసారధి చెప్పారు. రెండు వార్డులు ఎస్టీలు, 10 వార్డులు ఎస్సీలకు, 50 బీసీలకు, జనరల్ మహిళ 44, మరో 44 స్థానాలు జనరల్‌కు రిజర్వు చేసినట్లు వివరించారు.













