డిసెంబర్ లో గ్రేటర్ ఎన్నికలు ?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పక్రియలో మళ్లీ కదలిక మొదలైంది. తాజా ప్రతిపాదనల మేరకు నవంబర్ రెండో వారంలో షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. డిసెంబర్ మూడో వారంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కసరత్తు చేస్తోంది. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తారని భావించినప్పటికీ ఇటీవల వర్షాలు, వరదల కారణంగా జనవరి చివరలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఉండొచ్చని అంతా భావించారు. కానీ మళ్లీ ప్రభుత్వం నుంచి వచ్చిన సంకేతాలతో జీహెచ్ఎంసీ జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వీలైనంత వేగిరం చేస్తున్నారు. తదనంతరం ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు రాజకీయ ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో వరద బాధిత కుటుంబాలకు పంపిణీ చేస్తున్న రూ.10 వేల సాయాన్ని ఈ నెల 31లోగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ, రహదారుల మరమ్మతులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని కూడా ఆదేశించింది. అలాగే గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా వెలువడవచ్చనే సంకేతాలను కూడా సృష్టంగా ఇచ్చిన్నట్లు వినిపిస్తోంది.













