హైదరాబాద్‌లో కన్నుల పండువగా శోభాయాత్ర
హైదరాబాద్‌లో గణేష్ శోభయాత్ర, గణపతి నిమజ్జనం కన్నుల పండుగగా జరిగింది. నిమజ్జనం జరిగే హుస్సేన్ సాగర్ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. భారీ గణనాధులను తిలకించేందుకు పెద్దఎత్తున ప్రజలు ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చారు. ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా నృత్యాలు, భజనలు కోలాటం, బతుకమ్మ ఆట పాటలతో బొజ్జ గణపయ్యలను సాగరంలోకి సాగనంపారు. గణేష్ మహరాజ్ కి జై అనే నినాదాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మార్మోగాయి. గతేడాది కంటే ఈసారి ముందుగానే భాగ్యనగర ఉత్సవ కమిటీ శోభాయాత్రను ప్రారంభించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. భాగ్యనగర గణేష్ ఉత్సవాలకే తలమానికైన ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ఈసారి మధ్యాహ్నం సమయానికే పూర్తయింది.
పది రోజుల పాటు పూజలందుకున్న ద్వాదశ ముఖ లంబోదరుడి శోభయాత్ర ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఏజీ ఆఫీస్, సెక్రటేరియేట్, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా మధ్యాహ్నం ఒంటి గంట సమయాని నెక్లెస్ రోడ్‌లోని క్రేన్ నెంబర్ 6 వద్దకు చేరింది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 61 అడుగుల ఎత్తు, 45 టన్నుల బరువున్న మహాగణపతిని నిమజ్జనం చేశారు. గతంలో నిమజ్జం చేసిన ప్రాంతంలో కాకుండా ఈసారి లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నిమజ్ఞనం చేయడంతో భారీ గణేషుడు పూర్తిగా జలప్రవేశం చేశాడు.













