గాంధీభవన్లో గందరగోళం.. దిగ్విజయ్ ముందే నేతల బాహాబాహి
హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర గందరగోళ పరిస్థితి నెలకొంది. గాంధీ భవన్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. అయితే తెలంగాణ పీసీసీ వివాదాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన దూతగా దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఇటీవల పీసీసీని వ్యతిరేకిస్తున్న నేతలపై మాజీ మంత్రి అనిల్ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో దిగ్విజయ్ ఆయనతో భేటి అయ్యారు. భేటి అనంతరం మాజీ మంత్రిపై ఓయూ విద్యార్థి నేతలు దాడికి యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడే ఉన్న మల్లు రవి, ఇతర సీనియర్ నేతలు విద్యార్థి నేతలను అడ్డుకున్నారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నా తమకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ సింగ్ పార్టీలోని సీనియర్ నేతలతో ఒకరి తర్వాత ఒకరిగా అందరితో చర్చలు చేస్తున్నారు. వారిలో రేవంత్ రెడ్డి వర్గం నేతలు కూడా ఉన్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం నుంచి అసంతృప్తి నేతలతో సమావేశమవుతున్నారు. ఇంతలో గాంధీభవన్ బయట గందరగోళం చెలరేగింది. దిగ్విజయ్ సింగ్ ముందే నేతలు గల్లాలుపట్టుకుని బాహాబాహీ అయ్యారు. దీంతో అక్కడి పరిస్థితులపై దిగ్విజయ్ సింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీని కాపాడాల్సిన మీరే సమస్యగా మారితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పార్టీ జూనియర్, సీనియర్ పంచాయితీలు మంచివి కాదు. ఏ సమస్య ఉన్నా అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలి. మీడియా ముందు విమర్శలు చేసుకోవడం మంచిది కాదు. కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై సమానంగా ఉంది’’ అని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నట్లు సమాచారం.













