ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ అంతిమ సంస్కారాలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. హరికృష్ణ చితికి రెండో కుమారుడు కల్యాణ్‌రామ్ నిప్పంటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జయకృష్ణ, బాలకృష్ణ, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తదితరులు మహాప్రస్తానానికి చేరుకుని పాడె మోశారు. అంతకు ముందు మెహదీపట్నం నుంచి మహాప్రస్థానం వరకు సాగిన అంతిమయాత్రలో సినీ రాజకీయ ప్రముఖులు, టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు భారీగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ మంత్రులు నారా లోకేష్, ప్రతిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు హరికృష్ణ అంత్యక్రియాల్లో పాల్గొన్నారు. మహాప్రాస్థనంలో అధికారిక లాంఛనాలతో జరిగిన ఈ అంత్యక్రియల్లో హరికృష్ణ పార్టీవదేహానికి పోలీసులు గాల్లోలోకి కాల్పులు జరుపుతూ గౌరవ వందనం సమర్పించారు.













