కరోనా సమయంలో… ఎన్టీఆర్ ట్రస్ట్ కీలక నిర్ణయం

కరోనా సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడి మృతిచెందిన వారిని కొన్ని చోట్ల రోడ్ల పక్కన వదిలేయడంపై కలత చెందామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఈ నేపథ్యంలో అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు. కరోనా మృతుల కుటుంబీకులు ముందుకు రాకపోతే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే టెలీమెడిసిన్, మందుల పంపిణీ, అన్నదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల నిర్మాణానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రేపల్లె, పాలకొల్లు, టెక్కలి, కుప్పంలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రకటించింది.