హైదరాబాద్‌లో ఫోర్సిస్ కొత్త కార్యాలయం ప్రారంభం

అమెరికాలోని కాలిఫోర్నియాలో పేరు పొందిన ఫోర్సిస్ సంస్థ తన కొత్త కార్యాలయాన్ని హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, యుఎస్ కాన్సులర్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఈ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రైవేట్ సంస్థల పాత్ర కూడా కీలకమని, రాష్ట్రంలోని మరింతమందికి ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీధర్ బాబు ఈ సందర్భంగా తెలిపారు.
ఐ ల్యాబ్స్ గ్రూపు చైర్మన్ శ్రీనివాస రాజు, స్టార్ హాస్పిటల్స్ ఎండి, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ గోపీచంద్ మన్నం తదితరులు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఉపాధి అవకాశాల కల్పనకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన జె పి వేగండ్ల, ఆయన టీమ్‌ను అభినందించారు. హైదరాబాద్‌ను మరో సిలికాన్ వ్యాలీగా మార్చడంలో సహకరించాలని శ్రీధర్ బాబు కోరారు. కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ, అమెరికా, భారతదేశంతో ద్వైపాక్షిక బంధాలు బలంగా ఉన్నాయని, అలాగే ఐటీ, ఐటీ ఆధారిత సేవలలో భారతదేశం రాణిస్తోందని తెలిపారు.
ఐల్యాబ్స్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ శ్రీనివాస రాజు మాట్లాడుతూ, తాను మొదట్లో ఐటీలో కెరీర్ ప్రారంభించి తరువాత పెట్టుబడిదారునిగా ఉంటున్నానని, ఫోర్సిస్ సంస్థ స్థాపకుడు జెపి వేగేండ్ల తన ప్రతిభతో ఈ కంపెనీకి సిలికాన్ వ్యాలీలో మంచి గుర్తింపును తీసుకువచ్చారని, త్వరలోనే ఆయన దీనిని మరో బిలియన్ డాలర్ల కంపెనీగా మార్చినా ఆశ్చర్యపోనక్కరలేదని ప్రశంసించారు.
ఈ సందర్భంగా జెపి వేగేండ్ల మాట్లాడుతూ, హైదరాబాద్‌ను మరో సిలికాన్ వ్యాలీగా మార్చేందుకు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చేస్తున్న కృషికి తాము తప్పకుండా సహకరిస్తామని, తమ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించినందుకు రాష్ట్ర ఐటీ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన అతిధులకు కూడా ఆయన ధన్యవాదాలు చెప్పారు.
కాలిఫోర్నియాలోని ఫోర్సిస్ ఇంక్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కోట్-టు-క్యాష్ (క్యూ2సి) ట్రాన్స్‌ఫర్మేషన్ లీడర్ ఎండ్-టు-ఎండ్ టెక్నాలజీ కన్సల్టింగ్ మరియు సేవలను అందిస్తోంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడలోని ఫీనిక్స్ అక్విలా, టవర్ లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. 21,000స్క్వేర్ ఫీట్ తో, 400 మంది కూర్చుని పనిచేసుకునే సామర్థ్యం ఉన్న ఈ ఆఫీసును 2 మిలియన్ల డాలర్లతో సంస్థ ఏర్పాటు చేసింది.