ఫార్ములా ఈ-రేసింగ్ గ్రాండ్ సక్సస్
దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ ఫార్ములా ఈ-రేసింగ్ పోటీలు విజయవంతమయ్యాయి. ఈ పోటీలను వీక్షించేందుకు సినీ, క్రీడా రంగాలకు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలిరావడంతో అభిమానుల్లో జోష్ కనిపించింది. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తోపాటు శిఖర్ ధావన్, దీపక్ చాహర్, సినీనటుడు నాగచైతన్య, అఖిల్ అక్కినేని. మహేశ్ బాబు సతీమణి నమ్రత, కుమారుడు గౌతమ్, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, నారా బ్రాహ్మణి తదితరులు ఫార్ములా ఈ`రేసింగ్ జరిగిన హుస్సేన్ సాగర్ తీరానికి విచ్చేశారు.
రయ్య్ శబ్దం.. వంపులు తిరిగిన ట్రాక్.. వాయు వేగంతో దూసుకుపోయిన కార్లు.. ప్రేక్షకుల కేరింతలతో ఫార్ములా ఈ- రేసింగ్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని రెండు రోజుల షెడ్యూలుతో హుసేన్సాగర్ తీరంలో ఈ పోటీలను నిర్వహించింది. రెండురోజుల పాటు ప్రీ ప్రాక్టీస్ రేస్-1ను, ప్రీ ప్రాక్టీస్ రేస్-2ను నిర్వహించారు. అనంతరం క్వాలిఫైయింగ్ రౌండ్‌తో పాటు చివరకు ఫైనల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 22 మంది డ్రైవర్లు పాల్గొని ఎలక్ట్రిక్ కార్లతో దుమ్ము లేపారు. కండ్లు చెదిరేలా.. మెరుపు వేగంతో దూసుకొచ్చిన కార్లు.. నువ్వానేనా అన్నట్లు.. ఒకదానికి మించి మరొకటి పోటీపడ్డాయి.. 2.8 కిలోమీటర్ల ట్రాక్‌పై రయ్య్‌మ్రంటూ.. దుమ్మురేపుతుంటే.. ప్రేక్షకుల కేరింతలతో సాగర తీరం హోరెత్తిపోయింది. జీన్ ఎరిక్ వరల్డ్ చాంపియన్‌గా నిలిస్తే.. రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, అంటానియో డీ కోస్టాకు మూడో స్థానం దక్కింది. ఈ గ్రాండ్ ఈవెంట్‌ను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. జెట్ స్పీడుతో దూసుకెళ్లిన కార్లను చూసి మంత్రముగ్ధులయ్యారు.
రేస్‌ను వీక్షించిన ప్రముఖులు
ఈవెంట్లో సెలబ్రిటీలు, ప్రముఖులు సందడి చేశారు. మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సినీనటులు నాగార్జున, నాగచైతన్య, అఖిల్, రామ్‌చరణ్, సిద్ధు జొన్నలగడ్డ, సల్మాన్ దుల్కర్, యశ్, నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, జహీర్‌ఖాన్, చాహల్, దీపక్ హుడా తదితరులు పోటీలను వీక్షించారు. ట్రాన్స్‌కో-జెన్కో సంస్థల సీఎండీ ప్రభాకర్‌రావు, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
22 మంది రేసర్లు
ఈ పోటీల్లో మొత్తం 22 మంది రేసర్లు పాల్గొన్నారు. ట్రాక్‌పై కార్లు ‘రోబొటిక్’ సౌండ్‌తో దూసుకుపోతుంటే ప్రేక్షకులు సరికొత్త అనుభూతికి లోనయ్యారు. తమ సెల్ఫోన్లలో బంధించేందుకు తెగ ఆరాటపడ్డారు. రేసింగ్ పోటీల వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉదయం నుంచి పోటీలు ముగిసే వరకు ట్రాక్ చుట్టూ ఉన్న ఏడు గేట్ల వరకు ప్రేక్షకులు చేరుకునేలా ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపారు.
తెలంగాణ పోలీసులు ఫార్ములా ఈ-రేసింగ్ కోసం 2వేల మందితో పటిష్ట బందోబస్తు నిర్వహిం చారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోటీల సమయంలో పోలీసులు రేసింగ్ ట్రాక్‌తో పాటు సాగర్ పరిసరా లను హెలికాప్టర్ ద్వారా ప్రత్యేకంగా వీక్షించారు.
పలు కళాశాలల నుంచి విద్యార్థులు..
నగరంలోని బిట్స్ పిలానీ, లయోలా, వీబీఐటీ కళాశాల విద్యార్థులతో రేసింగ్ ప్రాంగణంలో సందడి నెలకొంది. వలంటీర్లుగా సుమారు ప్రతి కళాశాల నుంచి దాదాపుగా 500 మంది విద్యార్థిని, విద్యార్థులు విచ్చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఫార్ములా ఈ-రేస్ టీంలు
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ-రేసింగ్‌లో పలు దేశాల నుంచి పలవురు రైడర్లు పాల్గొంటున్నారు. బెల్జియం, ఫ్రాన్స్, బ్రెజిల్, యునైటెడ్ కింగ్డం, నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా, స్విట్జర్లాండ్, జర్మనీ, న్యూజిలాండ్, పోర్చుగల్ దేశాలు పాలుపొంచుకున్నాయి.
ప్రముఖుల స్పందనలు
ఫార్ములా-ఈ రేసింగ్ ఈవెంట్‌తో హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించడం గర్వకారణంగా భావిస్తున్నామని తాము కూడా తెలంగాణ లాగే.. ఫార్ములా రేస్‌ను నిర్వహించే దిశగా ఏపీని అభివృద్ధి చేస్తామని ఎపి మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ క్రిశాంక్ మన్నె మాట్లాడుతూ, ఫార్ములా ఈ-రేసింగ్ పోటీలను తిలకించేందుకు వివిధ దేశాల నుంచి తరలివచ్చారు. గ్లోబల్ సిటీ హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు మరింత రెట్టింపయ్యాయి. తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నగరాన్ని ప్రపంచ పటంపై మరోసారి నిలిచేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేసారు.
సచిన్ సందడి
ఈవెంట్లో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. ఆక్సలేటెరింగ్ ఎలక్ట్రిక్ కారులో కూర్చొని ట్రాక్ ల్యాబ్స్‌పై చక్కర్లు కొట్టారు. బటిస్టాలో ప్రయాణించడం సరికొత్త అనుభూతిని చ్చిందని సచిన్ తెలిపారు. హైదరాబాద్ వేదికగా ఈ పోటీలు జరగడం గొప్ప విషయమని కితాబిచ్చారు.













